Tuesday, 20 October 2026
Header1
BREAKING

<div><span style="background-color: transparent;">విశిష్ట రచన వినుకొండ సీమ సాహిత్య చరిత్ర</span></div>

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 05 Sep 2026, 06:28 AM
🔄 నవీకరణ: 27 Sep 2026, 12:33 PM
👁️ 26 views

అమరావతి. సెప్టెంబర్ 05 

సాహిత్యం ప్రత్యేకం


తెలుగు సాహిత్య చరిత్రలో వినుకొండకు విశిష్ట స్థానం ఉంది. ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు ఎందరో ప్రముఖ కవులు, రచయితలు ఈ వినుకొండ సీమలో జన్మించి, తెలుగు భాషాను సుసంపన్నం చేశారు. విశిష్ట స్థానాన్ని పొందిన కొందరు కవులు ఇప్పటికీ కీర్తించబడుతున్నారు. ఒకనాడు ఉన్నత స్థానాన్ని పొంది ప్రస్తుతం మరుగునపడిన సాహిత్యకారులు ఉన్నారు. వారి సాహితీ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ప్రస్తుతం సాహిత్య సేద్యం చేస్తున్న వాళ్లు ఉన్నారు. వారందరి సాహిత్య ప్రస్థానాన్ని గ్రంథస్తం చేసి *వినుకొండ సీమ సాహిత్య చరిత్ర* పేరుతో కె. జె రమేష్ తెలుగు సాహితీ ప్రియులకు అందించారు.

సాహిత్య చరిత్ర రచన ఆవశ్యకత

గతాన్ని క్రమబద్ధంగా, ఆధారాలతో నిరూపిస్తూ లిఖిత బద్దం చేయుటయే చరిత్ర. చరిత్రను నిర్మించడానికి, పునర్నిర్మాణానికి మరియు ఒక కాలం నాటి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి లిఖితపూర్వక లేదా సాహిత్య ఆధారాలు ముఖ్యమైనవి. అలాగే సాహిత్యకారుల సాహిత్యానికి సంబంధించిన విశేషాలు తెలుసుకోవాలంటే సాహిత్య చరిత్ర రచన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాలానుగుణంగా ఎందరో కవులు, రచయితలు సాహిత్య సృష్టి చేసినప్పటికీ వారి సాహిత్యంలో నాటి సామాజిక, ఆర్థిక, ప్రాంతీయ, రాజకీయ తదితర విశేషాలు ప్రతిబింబిస్తాయి. కాబట్టి సాహిత్య చరిత్ర రచన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పవచ్చు.

తెలుగు సాహిత్య చరిత్ర రచన ఆవిర్భావo వికాసాలు

తెలుగు సాహిత్య చరిత్రను, కవుల జీవితాలను సమగ్రంగా పరిశోధించి గ్రంథాలుగా అందించిన వారిలో కందుకూరి వీరేశలింగం, ఆరుద్ర, గురజాడ శ్రీరామమూర్తి, వంగూరి సుబ్బారావు, పింగళి లక్ష్మీకాంతం, దివాకర్ల వెంకటావదాని, కొర్లపాటి శ్రీరామ్మూర్తి, జి నాగయ్య, ముదిగొండ సుజాత రెడ్డి, ద్వాదశి నాగేశ్వర శాస్త్రి వంటి వారు ముఖ్యులు. అయితే సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వచ్చిన సాహిత్యంలో భాగంగా ఏర్పడిన వివిధ ధోరణులు, అస్తిత్వ, ప్రాంతీయ ఉద్యమాల వరకు ఎన్నో సాహిత్యచరిత్రలను రాస్తూ వచ్చారు.
సాహిత్య చరిత్ర కాలక్రమ పద్ధతిలో కవుల చరిత్రలనూ, రచనల సమీక్షలనూ కలిపి రూపొందించినంత మాత్రాన ఏర్పడదు. చారిత్రక అధ్యయనం ప్రతిబించాలనీ, చరిత్ర తత్త్వం వ్యక్తీకరింపబడాలనీ, అప్పుడే ఆ గ్రంథం విశిష్టంగా, విలక్షణంగా, పరిశోధనాత్మకంగా సాహిత్య చరిత్రలో నిలబడుతుంది.
పూర్వం రాజులు, సంస్థానాలు కవి, పండితులను పోషించినట్లే, నేటి ఆధునిక యుగంలో అనేక సాహిత్య సంస్థలు రచయితలను, కవులను ప్రోత్సహిస్తూ కవి సమ్మేళనాలను, సెమినార్లను ఏర్పాటు చేసి సన్మానాలను, సత్కారాలను మరియు పురస్కారాలను ప్రదానం చేస్తున్నాయి. సాహిత్యంలో కూడా అనేక రకాల ప్రక్రియలు సృష్టించబడుతున్నాయి. నూతనంగా అనేకమంది కవులు, రచయితలు కాలానుగుణమైన మార్పులను బట్టి రచనలు సాగించుచున్నారు. ఫలితంగా సమగ్రమైన సాహిత్య చరిత్ర లిఖించాలి అంటే *కత్తి మీద సామే* అని చెప్పుకోవాలి. ఏ సాహిత్యంలోనైనా రచన చేసేది రచయిత కాబట్టి వారి చరిత్రలను ఆయా రచనలలో ప్రోత్సహించిన సంస్థల లేదా వ్యవస్థల చరిత్రలనూ, ఆయా రచనలలో చరిత్రలనూ కాలక్రమ పద్ధతిలో సంఘటించి సాహిత్య చరిత్రను నిర్మిస్తారు.

ప్రాంతీయ సాహిత్య చరిత్రల ప్రస్థానం

ఏ భాషలోనైనా కవులందరి గురించి, అన్ని రకాల సాహిత్య ప్రక్రియలను గురించి సమగ్రంగా లిఖించడం కష్టతరమే అవుతుంది. ఫలితంగా కొందరు రచయితలు ప్రక్రియలకు సంబంధించిన సాహిత్య చరిత్రను క్రమబద్ధంలో లిఖిస్తే, కొందరు ప్రాంతానికి సంబంధించిన కవుల చరిత్రను లిఖించారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన తెలుగు సాహిత్య చరిత్రను ముదిగంటి సుజాత రెడ్డి, జూలూరు గౌరీ శంకర్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి మరియు సంగిశెట్టి శ్రీనివాస్ తదితరులు రచించారు. కల్లూరు అహోబలరావు, జానమద్ది హనుమచ్ఛాస్త్రి, వల్లంపాటి వెంకటసుబ్బయ్య వంటి వారు రాయలసీమ తెలుగు సాహిత్య చరిత్ర పై గ్రంథాలను రచించారు. కరీంనగర్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర (క్రీ.శ. 950 - 1995) పేరుతో మలయ శ్రీ, మహబూబ్ నగర్ జిల్లా తెలుగు సాహిత్య వికాసం పేరుతో భీoపల్లి శ్రీకాంత్,యాదాద్రి భువనగిరి జిల్లా సాహిత్య చరిత్ర పేరుతో పోరెడ్డి రంగయ్య, జోగులాంబ గద్వాల జిల్లా - సాహిత్య చరిత్ర కట్టా శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా సాహిత్య చరిత్ర పేరుతో పప్పుల రాజిరెడ్డి,వికారాబాద్ జిల్లా సాహిత్య చరిత్ర పేరుతో ములుగ అంజయ్య,ఉమ్మడి నల్లగొండ జిల్లా సాహిత్య చరిత్ర పేరుతో ఇడికోజు శ్రీనివాసచారి, తెలంగాణ ప్రాంతంలోని వివిధ జిల్లాలకు సంబంధించిన సాహిత్య చరిత్రను లిఖించారు.
పెనుగొండ లక్ష్మీనారాయణ *గుంటూరు సీమ సాహిత్య చరిత్ర* పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉమ్మడి గుంటూరు జిల్లా తెలుగు సాహిత్య చరిత్రను గ్రంథస్తం చేశారు. పల్నాడు ప్రాంతానికి చెందిన ప్రాచీన, ఆధునిక కవులు మరియు వారి సాహిత్య సేవను సమగ్రంగా క్రోడీకరించి బెజ్జంకి జగన్నాథచార్యులు పల్నాటి కవుల చరిత్రను రచించారు. పెనుగొండ లక్ష్మీనారాయణ ప్రేరణ, స్ఫూర్తితో అనేక గ్రంథాలయాలను దర్శించి, పలు గ్రంథాలను పరిశోధనాత్మకంగా సూక్ష్మ దృష్టితో పరిశీలించి, అనేక మంది సాహితీకారులను మరియు వారి కుటుంబ సభ్యులను సంప్రదించి తెలుగు సాహిత్య చరిత్రలో విశిష్ట స్థానాన్ని పొందిన వినుకొండ సీమ కవుల చరిత్రను వినూత్నంగా రచించి అందించారు కవి, రచయిత కె. జె రమేష్.

వినుకొండ సీమ సాహిత్య చరిత్ర

గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరు గ్రామంలో జన్మించిన రచయిత వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో గల ఈపూరు మండలం పేరూరుపాడులో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, సాధారణ బదిలీలలో వినుకొండ మరియు పరిసర ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ వినుకొండలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని, ఒకవైపు తన తండ్రి (సిలువ దారి నాటక కర్త) కొర్రపాటి జేమ్స్ ప్రోత్సాహం, గుర్రం జాషువా సాహిత్యంపై అభిలాషతో మరియు పలువురు సాహిత్య ప్రముఖుల సహవాసంతో వచన కవిత్వ ప్రక్రియలోనూ, వ్యాస మరియు అనువాద ప్రక్రియలో రచనలు చేసి, అరసం పెద్దాయన పెనుగొండ లక్ష్మీనారాయణ “గుంటూరు సీమ సాహిత్య చరిత్ర” రచనతో ప్రభావితులై వినుకొండ సీమ సాహిత్య చరిత్ర రచనకు పూనుకున్నారని రచయిత ఈ గ్రంథంలో తెలియజేశారు.
వినుకొండ పరిసర ప్రాంతాలలో జన్మించిన కవులను, వినుకొండలో జన్మించి ఇతర ప్రాంతాలలో నివసిస్తున్న కవులను, ఇతర ప్రాంతాలలో జన్మించి వినుకొండ పరిసర ప్రాంతాలలో నివాసముంటున్న 70 మందికి పైగా కవుల జీవిత, సాహిత్య ప్రస్థానాన్ని ఈ గ్రంథంలో సమగ్రంగా రచించారు.

వినుకొండ విశిష్టత

సాహిత్యానికి చరిత్రకి విడదీయరాని సంబంధం ఉంటుంది. గ్రంథకర్త కొర్రపాటివారు నేరుగా కవుల జీవితాన్ని, వారి సాహిత్యంలోకి వెళ్లకుండా వినుకొండ ప్రాంత భౌగోళిక, చారిత్రక నేపధ్యాన్ని మరియు ప్రాంత విశిష్టతను తెలియజేశారు. గుంటూరు జిల్లాలో అంతర్భాగమైన వినుకొండ భౌగోళిక, నైసర్గిక, చారిత్రక విశేషాలను, రాజుల ఏలుబడి గురించి, స్వాతంత్ర్య పోరాటం, రాజకీయ, సామాజిక ప్రాశస్త్యం గురించి ప్రస్తావించారు. వినుకొండ సమీపాన పసుపులేరు అను నది కలదని, అది గుండ్లకమ్మలో కలుస్తుందని, విష్ణుకుండినులు వినుకొండను రాజధానిగా చేసుకుని పరిపాలించారని, బౌద్ధ మతం క్షీణించిన తర్వాత హిందూ మతం రావడం, హిందూ మతం నుండి శైవం, వైష్ణవం తదితర మతాల ఆవిర్భావం మరియు వ్యాప్తి, వినుకొండలో ఆయా మతాల ప్రభావాన్ని చక్కగా వివరించారు.
కమఠుడు పర్వతంగా మారడాన్ని గురించి, జటాయువు వృత్తాంతాన్ని తెలిపారు. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా రచించిన నా కథలో వినుకొండను గురించిన ప్రస్తావనను, చారీత్రాత్మకంగా వినుకొండను గురించి, సరిహద్దు ప్రాంతాలను గురించి, వినుకొండను పరిపాలించిన విష్ణుకుండినులు వేయించిన శాసనాలను గురించి, శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో ఒక్కరైన ముక్కుతిమ్మన వినుకొండ పరిసర గ్రామమైన పువ్వాడ గ్రామంలో నివసించిన విషయాన్ని ప్రస్తావించారు గ్రంథకర్త. హరిదాసు వంశీయుడైన మంత్రి రాయన భాస్కరుని గురించి చారిత్రక, సాహిత్యపరమైన ఆధారాలతో నిరూపించి వినుకొండకు వారు చేసిన సేవను గురించి వివరించారు.

కవుల విభజన

కొందరు సాహితీకారులు సాహిత్య చరిత్ర విభజనను కవులు జీవించిన కాల క్రమాన్ని బట్టి గాని, వారు రచించిన ప్రక్రియను బట్టి గాని విభజించగా దీనికి విభిన్నంగా కొర్రపాటివారు వినుకొండ సీమ పూర్వకవులు, పద్యానికి పట్టం కట్టిన కవులు, శాసన సభ్యులుగా ఎన్నికైన కవులు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన కవులు, కథ, నవల, వ్యాస రచనల ద్వారా ప్రసిద్ధులైన కవులు, ప్రసిద్ధ వ్యక్తుల జీవితాలను గురించిన కవులు, వచన కవిత్వం, నూతన ప్రక్రియల ద్వారా ప్రసిద్ధులైన కవులు, పాట, గేయం మరియు బంధుత్వాలు గురించి రాసిన కవులు, బుర్రకథ ద్వారా ప్రసిద్ధులైన కవులు, భక్తి కవిత్వం ద్వారా ప్రసిద్ధులైన కవులు, నాటక రంగంలో ప్రసిద్ధి చెందిన వారు, సినిమా రంగ రచయితలు గా వినుకొండ సీమ కవులను విభజించి వారి సాహిత్య చరిత్రను లిఖించారు.

పూర్వ కవులు

*పూర్వకవులైన* రావిపాటి త్రిపురాంతకుని సాహిత్య జీవితాన్ని ప్రస్తావిస్తూ, వీరు శివభక్తులని మరియు 14వ శతాబ్దానికి చెందిన వారని మరియు ఉదాహరణ కావ్యాలను రచించిన విషయాన్ని, క్రీడాభిరామం రచయిత వినుకొండ వల్లభ రాయుని పుట్టుపూర్వోత్తరాలను మరియు అతని వంశ వృక్షం గురించి విపులంగా వివరించుటే గాక, అహోబల పండితుని గురించి చారిత్రక ఆధారాలతో గ్రంథకర్త చక్కగా వివరించారు. శుద్ధ గ్రాంథిక వాదాన్ని సమర్ధిస్తూ గిడుగు వారి వ్యవహారిక భాష ఉద్యమాన్ని వ్యతిరేకించిన కొక్కొండ వెంకటరత్నం పంతులు వినుకొండ ప్రాంతవాసుల అన్న విషయాన్ని ప్రస్ఫుటంగా తెలియపరచుటే కాకుండా, బ్రిటిష్ ప్రభుత్వం సంస్కృత పండితులకు ప్రదానం చేసే మహా మహోపాధ్యాయ బిరుదు వీరు అందుకున్న విషయాన్ని స్పష్టం చేశారు.

పద్యానికి పట్టం కట్టిన కవులు

పద్యానికి పట్టం కట్టిన కవులను గురించి ఏక సమాసంతో పద్యాన్ని రాయగలిగిన బీర్నీడి మోషే కవి మరియు వారి వంశవృత్తాంతాన్ని చక్కగా వివరించారు. గుర్రం జాషువా సహధ్యాయి, వ్యాఖ్యానాలు మరియు విమర్శలు రచించుటలో సిద్ధహస్తులైన దీపాల పిచ్చయ్య శాస్త్రి సాహిత్య ప్రస్థానాన్ని వివరిస్తూ, వీణ వాయించుటలో వీరు నేర్పరి అనే విషయాన్ని, కవులు మరియు పండితుల రచనలలో తప్పులను ఎత్తిచూపి విమర్శక గ్రేసర అను బిరుదును పొందిన విషయాన్ని, కుల, మతాలకతీతంగా మహాకవి గుర్రం జాషువాతో చెలిమి చేసినట్లు, నెల్లూరుకు చెందిన రెడ్లు వీరిని ఆదరించిన విషయాన్ని, భగవాన్ సత్యసాయి బాబాకు వీరు సన్నిహితులని గ్రంథకర్త తెలియజేశారు. వేమన గురించిన విశేషాలను వివరణాత్మకంగా గ్రంథస్తం చేసి మరుగున పడిన ఫరీద్ కవి గురించి సాహిత్య లోకానికి తిరిగి అందించారు. గద్దల జోసఫ్ సాహిత్య ప్రస్థానాన్ని తెలియపరుస్తూ, థామస్ మన్రో అంటరాని వారి విద్య కొరకు ప్రత్యేక బోర్డును ఏర్పరచినట్లు సందర్భానుసారంగా తెలియపరిచారు. బీర్నీడి మోషే కవి కుమారునిగా, ఆయన సాహిత్య వారసత్వాన్ని నిలబెట్టిన ప్రసన్న కవి సాహిత్య ప్రస్థానాన్ని తెలుపుతూ ఆయన తల్లి మరణ నేపథ్యాన్ని పురస్కరించుకొని మధుమాసం రచించినట్లు తెలియజేశారు గ్రంథకర్త. పోలూరి ఆంజనేయ ప్రసాద్ గురించి తెలియజేస్తూ నయాగర కవులలో ఒకరైన కుందుర్తి ఆంజనేయులు వీరి మేనమామ అని, వీరిద్దరూ కలిసి జంట కవిత్వం రాశారని, పోతన గురించి రచించినట్లు కొర్రపాటి వారు ఈ గ్రంథంలో పోలూరి వారిని గురించి తెలియపరిచారు. తాటిపర్తి శామ్యూల్ కవి సాహిత్య ప్రస్థానాన్ని తెలియజేస్తూ అర్ధాంతరంగా మధ్యలో చదువును ఆపేసిన వారికి చదువు చెప్పించి, వారు నడిపిన పాఠశాలలో ఉద్యోగాన్ని ఇచ్చినట్లు గ్రంథకర్త తెలియజేశారు. రెండు కావ్యాలు రచించి, భౌతిక జీవితకాలం మూడు పదులే అయినప్పటికీ, సాహిత్య లోకంలో చిరంజీవిగా నిలచారని, తన తండ్రి వారసత్వాన్ని నిలబెట్టారని బీర్నీడి విజయదత్తు సాహిత్య సేవను గ్రంథకర్త కొనియాడారు. భక్త రామదాసుగా కీర్తి పొందిన కంచర్ల గోపన్న 9వ తరం వారైన కంచర్ల పాండురంగ శర్మ గారి సాహిత్య ప్రస్థానాన్ని, యల్ల కరి తిరువెంగళ సూరి గురించి తెలియజేశారు. వృత్తిరీత్యా రక్షక భటులు అయినప్పటికీ తాత మరియు తండ్రి సాహిత్య వారసత్వాన్ని నిలబెట్టిన దుబ్బల దాసు కవి సాహిత్య జీవితాన్ని చక్కగా ఆవిష్కరించారు గ్రంథ రచయిత.

శాసన సభ్యులుగా ఎన్నికైన కవులు

కమ్యూనిజాన్ని మరియు అభ్యుదయ సాహిత్యాన్ని ముందుకు తీసుకు వెళుతూ, శాసనసభ సభ్యునిగా నిస్వార్ధమైన రాజకీయ నాయకునిగా ప్రజల మనసులో ముద్ర వేసుకొని " పలనాడు వెలలేని మాగాణి రా" అని పలనాటి సీమను కొనియాడి, సాహిత్య సేద్యం చేసిన పులుపుల శివయ్య గురించి, న్యాయవిద్యనభ్యసించి అభ్యుదయవాదాన్ని భుజానికి ఎత్తుకొని, తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఎర్రజెండాలుగా మలచినట్టి గంగినేని వెంకటేశ్వర్లు సాహిత్య సేవను చక్కగా పొందుపరిచారు రచయిత రమేష్.

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన కవులు

అంటరానితనం మరియు కుల వివక్షతలను ఎదుర్కొని సామాజిక అసమానతలపై పోరాటం చేసి, అనేక రచనలు చేసి, శాసనమండలి సభ్యునిగా, కళా ప్రపూర్ణునిగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన, విశ్వకవి సమ్రాట్ గుర్రం జాషువా సాహిత్య సేద్యం గురించి, అరసానికి అండగా నిలిచి, అందరూ రాసేవాళ్లే అయితే రాసేవాళ్లను మోసేవాళ్లు ఎవరు అని, సాహిత్య రచన చేసేవారి భారాన్ని మోస్తూ, కాల ప్రవాహంలో కరిగిపోయే ఎన్నో విషయాలను గుంటూరు సీమ సాహిత్య చరిత్రగా రచించి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన పెనుగొండ లక్ష్మీనారాయణ గురించి చక్కగా వివరించారు గ్రంథకర్త రమేష్.

కథ, నవల మరియు వ్యాసం ద్వారా ప్రసిద్ధులైన కవులు

సమాజం పట్ల బాధ్యత కలిగి, నేరస్తుల పరివర్తనకు పాటుపడి, తన తండ్రి గుర్రం జాషువా ఆశించిన వర్ణ వివక్ష రహిత సమాజం కోసం కృషి చేసిన హేమలత సాహిత్య ప్రస్థానాన్ని, శ్రీశ్రీ వ్యక్తిగత, సాహిత్య, మహాప్రస్థానాన్ని గురించి రచించిన చెరుకూరి సత్యనారాయణ గురించి, కె వి ఎల్ ఎన్ శర్మ గురించి, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు వన్నెతెస్తూ అభ్యుదయ, మానవతావాద సాహిత్య సృష్టి చేసిన జన్నాభట్ల నరసింహప్రసాద్ గురించి రాశారు.
ఏ కాలమైనా కోడిపుంజు కూతతోనే చీకటి పోతుందని, కోకిల పాడగలదు కానీ మేల్కొల్ప లేదని తన రచనల ద్వారా పంచములను మేల్కొల్పిన కాకాని సుధాకర్ గురించి, వినుకొండ ప్రాంతంలో తొలి డాక్టరేట్ పొందిన గిరిజన రచయిత్రిగా పేరుపొంది, భిన్న స్వరాలు పేరుతో వినుకొండలో పేరుగాంచిన కవులను గురించి రచించిన వడితే పద్మ గురించి, కథ, నవల మరియు వ్యాసం ద్వారా ప్రసిద్ధులైన కవులు అను విభాగంలో ఈ కవుల సాహిత్య చరిత్రను నిక్షిప్తం చేశారు గ్రంథకర్త.

ప్రసిద్ధ వ్యక్తుల జీవితాలు గురించి రాసిన కవులు

శ్రీకృష్ణుడు, ఏసు క్రీస్తు, గుర్రం జాషువాల జననం లోని సారూప్యతలను మరియు జాషువా జీవితాన్ని *జాషువా తపస్సు* అను గ్రంథంగా మలచిన అమృతపుడి రాజారావు సాహిత్య సాంస్కృతిక సేవను వివరించారు రచయిత. గద్దల జోసఫ్ కవి కుమార్తె కొడుకు తెలగలపూడి జాన్ ప్రసాద్ గురించి జాషువా మరియు అంబేద్కర్ జీవితాలను గురించి వారు రాసిన గ్రంథాలను ఉటంకించారు. సత్తెనపల్లి తాలూకా గ్రామ నామాలను చక్కగా వివరించిన వంకాయలపాటి రామకృష్ణ కవి గురించి, కులతత్వం మరియు అంటరానితనాన్ని ఎదుర్కొని రాజకీయంగా ఎదిగి చట్టసభల్లో ఉన్నత స్థితిలో నిలచిన దళితులను గురించి రచించిన సంకూరి రాజారావు వ్యక్తిగత, సాహిత్య జీవితాలను చక్కగా ఆవిష్కరించారు గ్రంథకర్త.

వచన కవిత్వం, వివిధ ప్రక్రియల ద్వారా ప్రసిద్ధులైన కవులు

ఎంత ఎత్తుగా ఎదిగిన మనిషి మంచితనంలో మరగుజ్జయిపోయాడని మనిషి తత్వాన్ని ప్రబోధించిన కొర్రపాటి జేమ్స్ రమేష్ తన గురించి, తన తండ్రి ఇచ్చిన ప్రేరణ గురించి మరియు తన సాహిత్య ప్రస్థానాన్ని ప్రస్తావించారు. అభ్యుదయ కవిత్వంతో సహవాసం చేసి, ముస్లిం మైనారిటీ కవిత్వాన్ని, అబాబీల ప్రక్రియను తెలుగు సాహిత్య లోకానికి అందించిన కవి కరిముల్లా గురించి గ్రంథకర్త చక్కగా వివరించారు.

పాట, గేయం మరియు బంధుత్వాలు గురించి రాసిన కవులు

*వస్తుంది నందికొండ నాగార్జునసాగర మొస్తుంది* పాటతో ప్రసిద్ధి చెందిన ధారా నరసింహ కవి గురించి, ప్రతి పాటకి రాగం, తానం స్వయంగా సూచిస్తూ సరాగమాలికను రచించిన రాయబారం శామ్యూల్ కవి గురించి, మూఢనమ్మకాలను మరియు చాందసభావాలను నిరసించి, తన భార్య పేరులోని కమలను, తన పేరులోని రామును కలం పేరు గా మలచుకుని రచనలు చేసిన కమలారామ్ గురించి, ప్రకృతి మరియు గుర్రం జాషువా పట్ల ప్రేమాభిమానాలు చాటుకున్న అమృతపూడి రేవతి గురించి ఈ విభాగంలో చక్కగా వివరించారు గ్రంథకర్త.
బుర్రకథ ద్వారా ప్రసిద్ధులై, జాతీయస్థాయిలో గుర్తింపు పొంది, గవర్నర్ పురస్కారాన్ని పొందిన పెద్దిటి యోహాను గురించి సవివరంగా రాశారు.

భక్తి కవిత్వం రాసిన కవులు

జీవితంలో తాను ఎదుర్కొన్న ఆటుపోట్లను, తాత్వికచింతనతో శ్రీ రామ రామ శతకం రచించిన బోడేపూడి వెంకటసుబ్బయ్య గురించి, పోలూరి సత్యనారాయణ గురించి, జాషువా శిష్యరికంలో భక్తపాల శతకాన్ని రచించిన పసుపులేటి ఆంధ్రీకవి గురించి, యేసు ప్రదీపిక పద్య గ్రంధాన్ని రచించిన పందుల జాషువా గురించి, రమణ మహర్షి తత్వాన్ని బాలప్రియ అను పేరుతో వ్యాఖ్యానం రాసిన పోలూరి హనుమ జానకి రామ శర్మ గురించి, వేదాలను సులభరీతిలో అందించిన భాస్కరుని మల్లికార్జున రావు గురించి, ఖగరాజు పేరుతో హితోక్తి అందించిన గద్దల శామ్యూల్ గురించి, పసుపులేటి జేసురత్నం గురించి, గాయత్రీ మంత్రాన్ని శతకంగా మలచిన దిట్టకవి శ్రీనివాసాచార్య, కడు భక్తి భావంతో సాయినాథ శతకాన్ని రచించిన ఉమాకాంత ప్రసాద్ వంటి భక్తి కవుల సాహిత్య ప్రస్థానాన్ని కూలంకషంగా తెలియజేశారు కొర్రపాటివారు.

నాటక రంగంలో ప్రసిద్ధులైన కవులు

రైతు జీవితాన్ని నాటకాలుగా మలచిన సబ్నవీసు రామారావు, పాటకి పద్యానికి తన సాహితీ పటిమతో ప్రాణం పోసిన జన్నాభట్ల నరసింహ శాస్త్రి, సినిమా సాహిత్యాన్ని సృష్టించిన అనంత హృదయ రాజు, సమాజ అభ్యున్నతిని కాంక్షిస్తూ సందేశాత్మక నాటకాలు, నాటికలు రచించిన శిష్ట చంద్రశేఖర్ మరియు తన మాటల ప్రతిభను నాటకం, నాటిక మరియు సీరియల్స్ లో చూపుతూ నాటకాలు రచించిన రాంప్రసాద్ ల జీవిత సాహిత్య ప్రస్థానాలను ఈ గ్రంథంలో వెలువరించారు కె. జె రమేష్.
తనకున్న ప్రతిభ, విధేయత, మంచితనంతో గొప్ప పేరు తెచ్చుకున్న దారివేముల రామజోగయ్య శాస్త్రి గురించి చక్కగా వివరించారు.
ప్రజా కవి వేమన, బొగ్గవరపు పెదపాపరాజు, పోలూరు శ్రీరాములు, మద్రాస్ కమ్యూనికేషన్ ఏర్పరచి, ధీరుభాయిజం గ్రంధాన్ని రచించిన అచ్యుతుని గోపాలకృష్ణమూర్తి, నర్రా నరసయ్య, పోలూరి కుసుమ హరిప్రసాద్, దర్జీల బతుకులు రచించిన షేక్ మస్తాన్ వలి, మనిషిని మనిషిగా గౌరవించలేని ఈ సమాజంలో అంటరానితనం ఎలా పోతుందని ప్రశ్నించి రచనలు చేసిన జంగాల విలాస్ వంటి వారి సాహిత్య ప్రస్థానం గురించి వివరించారు.

ముగింపు

వృత్తిరీత్యా జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేసి, ఉత్తమ ఉపాధ్యాయునిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అవార్డు పొంది, వర్తమాన లిపి, భ్రమల్ని మోసుకుంటూ, వినుకొండ నుండి విశ్వనరుడు, నానీలు వంటి వచన కవిత్వ, నూతన ప్రక్రియలలో రచనలు చేసి, వృక్షమిత్ర, పీవీ నరసింహారావు జాతీయ సాహిత్య పురస్కారం మరియు పలు సాహితీ సంస్థల నుండి జాషువా పురస్కారం అందుకొని పరిశోధనాత్మకంగా వినుకొండ సీమ సాహిత్య చరిత్ర రచించడం గొప్ప ప్రయత్నంగా చెప్పవచ్చు. ఒక అంశం పై ఏ ఇద్దరి కవులకు ఏకాభిప్రాయం లేని ఈ రోజుల్లో ఒక ప్రాంత కవుల సాహిత్య కృషిని గ్రంధస్థo చేయడాని కి నడుము కట్టి, పూర్వకవులను గురించి గ్రంథాలయాలలో సేకరిస్తూ, పరమపదించిన సాహితీకారులను గురించి వారి కుటుంబీకులను మరియు అనుభవజ్ఞులైన సాహితీకారులను కలసి, ఆధునిక మరియు వర్ధమాన కవులను కలసి వారి వారి సాహిత్య సమాచారాన్ని సేకరించి గ్రంథస్తం చేయడంలో సఫలీకృతులయ్యారు కొర్రపాటివారు.70 మందికి పైగా సాహితీకారుల సాహిత్యo మరియు వారి జీవితం వినుకొండ సీమ సాహిత్య చరిత్రగా రూపొందిన ఈ పరిశోధనాత్మక గ్రంథం విశ్వవిద్యాలయాలలో తెలుగు ఎం ఏ అభ్యసించే విద్యార్థులకు రిఫరెన్స్ గా పెట్టుటకు పరిశీలించవచ్చునని, పొరపాటున గ్రంథస్తం చేయలేకపోయినా వినుకొండ ప్రాంత కవులను మరొక ముద్రణలో చేర్చగలనని తెలియజేసిన గ్రంథకర్త కొర్రపాటి వారికి సహకరించాలని, విశిష్టమైన వినుకొండ సీమ సాహిత్య చరిత్రను సాహిత్య ప్రియులు మరింత ఆదరించాలని, కొర్రపాటి వారి కలం నుండి మరింత విలువైన సాహిత్యం జాలువారాలని కోరుకుంటూ...

*అనిల్ కుమార్ దారివేముల*
*మాచర్ల, పల్నాడు జిల్లా*
*9951244718.*

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X